

హైదరాబాద్ నుంచి దళిత సాంస్కృతిక సంస్థ 'చిందు' వాళ్లు కేరళ కొండ కోనల్లోకి పోతూ మమ్మల్ని కూడా (ఆర్టిస్టు మోహన్ను, నన్నూ) పట్టుకుపోయారు.. మొన్నీమధ్యనే. అక్కడి కొండలు మహా కులుకుతాయో ఏమో! ఒంపు సొంపులు తిరిగే ఘాట్ రోడ్డు కొట్టాయం అంచు నుంచీ మొదలైంది. పచ్చటి లోయలు వగలుపోతూ అడుగు ముందుకెయ్యనియ్యవాయె. మేం ఎక్కిన బండికి ఎదురొచ్చే బళ్ల ధ్యాసే లేనట్టుంది... పొదల్లో పాములా సరసరా సాగి వాగమన్ అనే కొండ మీది పల్లెలో స్వర్గం లాంటి, రిసార్టు వంటి అందాల వసతికి చేర్చింది. లారీ బేకర్ గారు మొదట ప్రయోగం చేసిన టెర్రకోట ఇళ్ల లోగిళ్ళ వలయం అది. అ పక్కనే ఉన్న కొండమీది ఇంటికి అప్పుడప్పుడు అరుంధతీరాయ్ వచ్చి రాత పనులు చేసుకుపోతుంటారట.
వాగు వంకల పక్కనే ఎత్తుకు పైఎత్తు కొండలు దాటుకు పోతుంటే మనం కరిగి నామరూపాలు లేకుండా పోవడం కనిపిస్తుంది. ఎదర రెండు మూడు లక్షల కొబ్బరి చెట్లు, రెండు లక్షల అరటి చెట్లు, వాటికి కాసిన ఎర్రటి కొండ అరటికాయలు చేతులూపి పిలుస్తున్నట్టుంటాయి. తల వంచుకుని మాట్లాడుతున్నట్టుండే తారు పెంకుటిళ్లు... పచ్చటి బోడిగుండుల్లాటి 'మెడోస్' మీద పడి దొర్లే టూరిస్టులు... అంతా పరమాద్భుతం.


మేము బస చేసిన ఇళ్ళ చుట్టూ ఆకుల గలగలను మోసుకొచ్చే గాలి... నోటితోనూ గాలి పీల్చుకోవచ్చన్నంత శుభ్రమైన గాలి, మా కోసం కాబోలు కొంచెం కూడా కొబ్బరినూనె వాడని కేరళీయ వంటకాలు చేశారు. అక్కడికి ఉప్పుడు బియ్యం మన ప్రాంతాల నుంచే ఎక్కువ సరఫరా అవుతుందని మళయాళీ వంటాయన చిరునవ్వు నవ్వి చెప్పాడు. మూలికలు కలిపిన వేడి రంగునీటిని తాగడానికి ఇచ్చాడు. ఆపై నికార్సయిన టీ, మరోటీ శ్రమ తెలీకుండా తెగపుచ్చుకున్నాం. మేమున్న గదుల్లో ఒక్క దోమ లేదు. అసలు 'ఫేన్'లే లేవు! కొండగాలి సువాసనలు దోమలకు నచ్చదేమో మరి. అంతా తిరిగి నడుస్తోంటే లోయ మధ్యలో వేలాడుతున్నట్టుంది- గాల్లో ఈదుతూ.




దాంతోపాటు అవకతవక అనువాదాల వల్ల మూలగ్రంథాలు ఎలా పాడవుతాయో నెత్తీనోరూ బాదుకుంటూ చెప్పారు. థాంక్ గాడ్! ఒక ఢిల్లీ పెద్ద మనిషికి, ఒక మలయాళీకి, ఒక తమిళుడుకి ఆధునిక తెలుగు రచయితలు తెలుసు- ఇది భలే ఉంది- చర్చ సాగనివ్వచ్చు- అనుకునే సమయానికి చిన్నపాటి క్లయిమాక్స్ పేలింది. అప్పటిదాకా ఆంగ్లం దంచిన ప్రబలన్ తన పుట్టుక, స్కూలు చదువు మన విజయనగరంలో జరిగాయని చెప్పాడు. ఆ తర్వాత ప్రేమ పెల్లుబుకి ఆయన తెలుగులో దడదడ ప్రసంగం అందుకున్నాడు. చివరాఖరున ఏ ఉద్యమమైనా సాంస్కృతిక కళారూపాల్లో మరీ ముఖ్యంగా స్థానిక, జానపద రూపాల్లో అణగారిన ప్రజాసమూహాల్లోకి చొచ్చుకుపోనిదే వట్టి మేధో చర్చలు సాగించి లాభం లేదని లక్ష్మణన్ ఒక 'అండర్‌లైన్' లాంటి ముక్కతో ముగించారు.

మోహన్‌గారి యానిమేషన్ చిత్ర ప్రదర్శన చూసి హోల్ మొత్తం జనం వార్నాయనో అని పై స్వరంతో అన్నారు. మమ్మల్ని అక్కడికి తెచ్చిన కారణం కోసం నేను, మోహన్‌గారు చెట్ల కింద రకరకాల సీతాకోకచిలకల మధ్య, సుదీర్ఘంగా పాడే మలబార్ కోయిల ఈల వింటూ, పూలు రాలిన గడ్డిని చూస్తూ డజనుకు పైగా పెయింటింగ్‌లు వేశాం. ప్రదర్శన తరువాత వాటిని వాళ్ళకి ఇచ్చేసి వాగమన్ ముచ్చట ముగించుకున్నాం. మా అందరి అరచేతులు పచ్చడయ్యేట్టు వాళ్ళంతా ఇచ్చిన షేక్‌హాండ్‌లతో వేన్ ఎక్కి లోయల్లోకి పాదరసంలా జారుతూ రైల్లోకొచ్చిపడ్డాం. తెల్లారి (జింబో) నగర ప్రవేశం చేశాం.
ఈ యాత్రా విశేషాలు చదివిన వారందరికీ ప్రకృతి దృశ్య వీక్షణం, ఈర్ష్యాసూయలు ఉచితముగా కలుగు గాక!

- శివాజీ
No comments:
Post a Comment