విహారాలు

India

Gamyam

Sunday, December 4, 2011

సుగంధాల పచ్చదనం ఫ్రాన్స్ పల్లెసీమలు

ఫ్రాన్స్ అంటే చాలామందికి పారిస్సే. నిజమే గొప్ప గొప్ప మ్యూజియాలు, ఈఫిల్ టవర్ వంటి భారీ నిర్మాణాలు పారిస్‌లోనే ఉన్నాయి.
కాని ఒక దేశం గురించి నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆ దేశంలోని గ్రామీణ ప్రాంతాలను సందర్శించాలి. అయితే పల్లెటూళ్ళకు వెళ్ళే అవకాశం ఎంతమంది విదేశీయులకు దొరుకుతుంది? నా అదృష్టం కొద్దీ ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో 20 రోజుల పాటు బసచేసే అవకాశం నాకు లభించింది. ఆ అనుభవాలే ఈ ట్రావెలోకం.

వైవిధ్యమైన శీతోష్ణ ప్రాంతాలు, సంపన్న సంస్కృతి గల విశాలమైన దేశం ఫ్రాన్స్. నేను వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుణ్ణి అయినందువల్ల ఫ్రాన్స్ ప్రజలకు ఆయుర్వేద చికిత్సలను పరిచయం చేయడానికి అక్కడివారు నన్ను ఆహ్వానించారు. జూలై, ఆగస్టు మాసాలలో మొత్తం నెల రోజులు అక్కడ ఉన్నాను. అం దులో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో గడిపింది పది రోజులు. గ్రామీణ ప్రాంతాలలో గడిపిన మిగతా 20 రోజులు ఒక మధురానుభూతిగా మిగలడానికి ఫ్రాన్స్ దేశీయులు వారి పల్లెసీమలను నిర్వహించుకుంటున్న తీరే కారణం.

మొదటగా పారిస్‌కు 200 కి.మీ దూరంలో ఉన్న బూజ్ (Bouge) గ్రామ సమీపంలోని 'గ్ర సీలియ' అనే విద్యాలయానికి వెళ్ళాను. పారిస్‌లోని మోంటో పర్నాస్ రైల్వేస్టేషను నుండి బయలుదేరిన టిజివి రైలు శరవేగంగా పరుగెత్తి ఓ గంట తర్వాత 'లె మాన్స్' పట్టణంలో ఆగింది. అక్కడి నుంచి బూజ్ గ్రామం వెళ్లడానికి గ్రామాల మధ్య తిరిగే బస్సు ఎక్కాలి. పారిస్ శివార్లు దాటగానే ఫ్రాన్స్ గ్రామీణ ప్రాంతం కనువిందు చేస్తుంది. అప్పటికి చాలా పొలాల్లో గోధుమ పంటను కోసి గడ్డిని గుండ్రటి ఆకారాలుగా కట్టిపెట్టారు. గోధుమ పండించిన పొలాల ఆవల పచ్చటి మైదానాలు కనుచూపు మేర విస్తరించి ఉన్నాయి.

అక్కడక్కడ ఆవులు, గొర్రెలు పచ్చిక మేస్తూ దూరంగా వెళ్ళే రైళ్ళను అపుడపుడు తలెత్తి చూస్తున్నాయి. వేసవి కాలం కావడంతో ఉష్ణోగ్రత 25 డిగ్రీలే ఉండి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ రాత్రి పదిగంటల వరకు చీకటిపడదు. అక్కడక్కడ గోధుమగడ్డి గుండ్రటి కట్టలను వివిధ వస్తువుల ఆకారాల్లో అమర్చి పొలాలను కూడా రైతులు కళాగారాల్లా తీర్చిదిద్దారు. కొన్ని గడ్డిమోపులు ట్రాక్టర్ ఆకారంలో ఉంటే మరికొన్ని కార్టూన్ బొమ్మల్లా మనల్ని పలకరిస్తున్నట్టుంటాయి.

దూరంగా ఆహ్వానిస్తున్నట్టు కనిపించే చర్చి శిఖరాలు గ్రామాల ఉనికిని చాటుతుంటాయి. ప్రతి గ్రామంలో చర్చి శిఖరం శోభాయమానంగా ఉంటుంది. తీర్చిదిద్దినట్టుండే గ్రామీణ వీధులు నిర్మానుష్యంగా ఉన్నా కళాత్మకతను చాటిచెప్పేలా ఉంటాయి. ఎటువైపు చూసినా పుష్పాలు, మొక్కలకు నీరు పెడుతున్న పిల్లలు, సాంప్రదాయ రీతిలో నిర్మించిన చిన్న చిన్న ఇళ్ళు అన్నీ కలిపితే స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. సెలవలు కావడంతో పెద్దలు కూడా పిల్లలతో కలిపి గోళీలాడడం కనిపించింది.

ఫ్రాన్స్ ఆర్థిక రహస్యం

లె మాన్స్ నుండి బూజ్ గ్రామానికెళ్ళే బస్సు కచ్చితమైన సమయానికొచ్చింది. టికెట్ ధర కాస్త ఎక్కువయినా ప్రయాణం మాత్రం ఓ టూరిస్టు ప్రోగ్రాంలా ఉంది. కండక్టర్ కమ్ డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి వచ్చిన, రాబోయే గ్రామాల పేర్లు చెబుతూ, ప్రయాణికులను నవ్విస్తూ అందర్నీ ఆనందింపజేశాడు. అక్కడి రైతులు, ఇతర వృత్తుల వారు పట్టణాల్లో ఉద్యోగుల కన్నా సుభిక్షంగా ఉన్నారనేది స్పష్టంగా కనిపించింది. బహుశా ఇదేనేమో ఫ్రాన్స్ ఆర్థిక రహస్యం.

బూజ్ గ్రామంలో ఉన్న 12 రోజులు చుట్టుపక్కల కాలినడకన, సైకిల్‌పై చుట్టి వచ్చాను. వేసవి కావడంతో ఎక్కువమంది తమ మోటార్ హోమ్‌లలో ప్రయాణిస్తూ ఎక్కడ ప్రకృతి అందంగా ఉంటే అక్కడ క్యాంపు వేస్తున్నారు. ప్రభుత్వం కూడా వారి కోసం అక్కడక్కడ క్యాంపింగ్ స్థలాలను ఎంపిక చేసి కొన్ని సౌకర్యాలను కలుగజేసింది. అటువంటి ఓ క్యాంపులో పళ్ళను మాత్రమే ఆహారంగా తీసుకుంటాననే ఒక యువకుడు పరిచయమయ్యాడు. రోజులో మూడు పూటలా ఫలాలనే ఆహారంగా స్వీకరించే ఆ యువకుణ్ణి అడిగాను 'మీ శరీరానికి అవసరమైన కొవ్వు ఎలా లభిస్తుంది?' అని. 'అవకాడీ' ఫలాల నుంచి అని అతని జవాబు.

మరొక వ్యక్తి గ్రామాలు తిరుగుతూ పడవేసిన ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగించి అం దులో కొంత మట్టివేసి మొక్కలనెలా పెంచాలో పిల్లలకు వీధుల్లో బోధిస్తున్నాడు. వేసవి సెలవలలో ఎవరికి ఇష్టమైన పనిని వారు శ్రద్ధగా చేస్తున్నారు. అందుకే ఫ్రాన్స్ గ్రామసీమలు అం త ప్రశాంతంగా, హృద్యంగా ఉన్నా యి. బూజ్ గ్రామం లో ఉన్న కాజిల్ (కోటమహలు) ప్రదర్శనశాలగా మార్చారు. గ్రామప్రాంతం కావడంతో యాత్రికులు తక్కు వ సంఖ్యలో వస్తు న్నా పర్యాటక విభా గం వారు చాలా శ్రద్ధగా పనిచేస్తున్నారు.
అందుకే ఆరోగ్యం

నేను బసచేసిన విద్యాలయం వారు ప్రతిరోజు రుచికరమైన ఆహారాన్ని తయారుచేసేవారు. ఫ్రాన్స్‌లో ఎక్కువ మంది ఆహారంతో పాటు వైన్ సేవిస్తారు. అందుకే వారికి గుండెపోట్లు తక్కువంటారు. వైద్యపరంగా ఇది నిజం కాకపోయినా (వైన్ వల్ల హృదయానికి మేలు జరగాలంటే రోజూ రెండు లీటర్ల వైన్ తాగాలి. అది మరోరకంగా మనిషిని చంపుతుంది) వారి హాస్య ప్రవృత్తివల్లే వారు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారని నాకనిపించింది.

అక్కడి ఇళ్ళలో యంత్రాలను ఎక్కువగా వాడడం వల్ల స్త్రీలకు అంట్లు కడిగే బాధ లేదు. పళ్ళేలను ఎక్కువ కడగనవసరం లేకుండా శుభ్రంగా ఊడ్చి తినే అలవాటు వారికుంది. ఉదయమే వెడల్పాటి గిన్నెలో కాఫీ పోసుకుని అందులో బ్రెడ్ అద్దుకుని తినడం వారికిష్టం. భోజనాలు చేస్తూ గంటలు గంటలు మాట్లాడే అలవాటు వారిది. నిశ్శబ్దంగా భోజనం చేయడమంటే వారికి పడదు. వారి వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. ఫలాలను కూడా ఉడికించి చాక్లెట్ పట్టించి తింటారు.

సైకిల్ రహదారులు

బూజ్ గ్రామ సమీపంలో 'లప్లెష్' అని మరో గ్రామం ఉంది. అక్కడే ఫ్రాన్స్ శాస్త్ర సాంకేతిక రంగాలకు వన్నె తెచ్చిన 'రెనె డెకార్తె' చదివిన పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఆ కాలం నాటి ఆవిష్కరణలన్నింటినీ కలిపి చక్కటి ప్రదర్శనశాలగా ఏర్పాటు చేశారు. బూజ్ గ్రామంలోని కోటమహలులో 16వ శతాబ్దానికి చెందిన ఆసుపత్రి నేటికీ సజీవంగా ఉంది. చుట్టుపక్కల అన్ని గ్రామాలను కలుపుతూ వేసిన సైకిల్ రహదారులలో భార్యాభర్తలు, పిల్లలు కలిసి సైకిళ్ళు తొక్కుతూ చేసే విహార యాత్రలు చూడముచ్చటగా అనిపిస్తుంది. తేనెటీగలు పెంచడం, తేనె అమ్మడం, స్థానికంగా ఎరువులు వేయకుండా పండించిన కూరగాయలను వారం వారం గ్రామసంతలలో అమ్మడం అక్కడ సాధారణ దృశ్యాలు.

బూజ్ నుంచి 'బ్రిటానీ' ప్రాంతానికి వెళ్ళేలోపు లె మాన్స్ సమీపంలోని 'లోయర్ నదీ లోయ'లో అద్భుతమైన గ్రామీణ ప్రదేశాలు చూశాను. ప్రాచీనకాలంలో నదికిరువైపుల గుర్రాలతో నదిలోని పడవలను నడిపించిన ఆనవాలు నేటికీ అక్కడ కానవస్తాయి. పాత వంతెనలను పడగొట్టకుండా వాటికే మరమ్మత్తు చేసుకుంటూ పాత నిర్మాణాలే మా ఆస్తి అంటారు వారు.

పెయంపోల్‌లో సందడే సందడి

బ్రిటానీ ప్రాంతం ఫ్రాన్స్‌లో ఒక పాపులర్ పర్యాటక ప్రాంతం. అట్లాంటిక్ సముద్రాన్నానుకుని కొండలతో లోయలతో ఎంతో బాగుంటుంది. అక్కడక్కడా 'హలో' అని చెబుతున్నట్టుగా ఎత్తయిన గాలిమరలు, ద్రాక్షతోటలు అన్నీ కలిపి అది మరో ప్రపంచంలా ఉంది. గాలిమరలను ప్రస్తుతం వాడకపోయినా గ్రామస్తులంతా కలిసి వాటిని చక్కగా పరిరక్షించుకుంటున్నారు. బ్రిటానీ ప్రాంతంలో 'ఫ్లయెజెక్' గ్రామంలో ఒక వారం రోజులున్నాను. అక్కడికి సమీపంలోని పెయంపోల్‌లో పండుగ జరుగుతుండింది. అది బెస్తవారి పండుగ. చేపలు పట్టేవారు వారి సాంప్రదాయ దుస్తులతో ఆటపాటలతో రాత్రి పగలు తేడా లేకుండా సందడి చేసే పండగ ఇది. ఫ్రాన్స్ అంతటా ఫ్రెంచి భాషే మాట్లాడినా బ్రిటానీ ప్రాంతంలో ఉన్న సెల్ట్‌లు ఇంకా వారి భాషను గుర్తుంచుకున్నారు. రకరకాల సముద్ర ఆహారాలను అక్కడ రుచి చూడవచ్చు. ఆరోజు నా కోసం ప్రత్యేకంగా 'స్టింగ్ రే' చేపను వండారు.

పారిస్ చేరే లోపు దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో గ్రామీణుల జీవితం కూడా చూశాను. పట్టణ ప్రాంతవాసుల కంటే వారి జీవితం ఎంత ఆనందదాయకంగా, హాయిగా సాగిపోతోందో అర్థమయింది. స్విట్జర్లాండ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో వేసవిలో సైతం మంచుతో కప్పబడిన పర్వతాలు, నిండుగా ప్రవహిస్తున్న నదులు చూసినపుడు మానవ సంపర్కం లేని ప్రపంచం ఇంకా ఇంత ఉందా అని విస్మయం చెందుతాం. అందువల్లనేమో పారిస్‌వాసులు చాలామంది గ్రామాలలో చిన్న ఇళ్ళను కొనుక్కుని వేసవిలో కొన్ని వారాలు అక్కడే గడుపుతారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కన్నా, చిత్రశాలలు (మ్యూజియంలు), అత్తరు షాపుల కన్నా ఫ్రాన్స్ గ్రామాలు మనసుకు ఎంతో శక్తినిస్తాయి. ఆ పల్లెలలో నిద్రిస్తే ఉదయాన్నే మనల్ని నిద్రలేపేది గడియారం కాదు... పక్షుల కిలకిలారావాలు, విచ్చుకుంటున్న అందమైన పుష్పాలు, కల్తీలేని గ్రామస్తుల చిరునవ్వులు.

- డా. పి.వి. రంగనాయకులు, తిరుపతి
ఫోన్ : 96765 71947

No comments:

Post a Comment