విహారాలు

India

Gamyam

Saturday, August 11, 2012

'' బ్రూనై '' .... గాంధీ కలగన్న దేశం

'గాంధి కలలుగన్న దేశం ఇదే. ఇక్కడ ఎంత రాత్రిపూటయినా సరే ఆడపిల్ల ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళగలదు. ఈ దేశంలో గత 20 ఏళ్ళలో ఒక్క హత్యా నమోదు కాలేదంటే ఆలోచించండి ఎంత ప్రశాంతమైన దేశమో'... బ్రూనై దారుస్సలాంలో తొమ్మిదేళ్ళుగా ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేస్తున్న వాసుదేవ్ అడారి చెప్పిన  విశేషాలివి.

బోర్నియో ద్వీపకల్పంలో వాయవ్యాన ఉన్న ఓ చిన్న అందమైన దేశం బ్రూనై దారుస్సలాం. 2010 జూలై లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా కేవలం నాలుగు లక్షలు. భారతదేశపు ఏ ఒక్క కాలనీలో మొహల్లాలోనో కనిపించే జనసాంద్రత ఇది. అలాంటిది దేశం మొత్తంమీద అంత తక్కువమంది ఉన్నారంటే అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ముఖ్యంగా ఎంత పరిశుభ్రంగా ఉంటుందో పాఠకులు ఊహించుకోవచ్చు. ఈ నాలుగు లక్షల ప్రజల కోసం దాదాపు లక్షన్నర మంది విదేశీయులు వివిధ ఉద్యోగాల్లో సేవలందిస్తున్నారు.

అధికారిక మతం ఇస్లాం, భాష మలయ్. మలేషియా, ఇండొనేషియా, సింగపూర్‌లలో కూడా అధికార భాష అదే. నిజానికి మలయ్ అన్న పదం ఓ జాతి ప్రజల పేరుగా వాడుకలో ఉంది. దేశ జనాభాలో అరవై ఏడు శాతం ప్రజలు మలయ్‌లుగా పిలువబడుతూ మలయ్ భాషని మాట్లాడేవారిగా ఉన్నారు. రెండు మూడు స్థానాల్లో ఇంగ్లీష్, చైనీస్ భాషలు ఉన్నాయి. దాదాపు అందరూ కాస్తో కూస్తో ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి విదేశీయులకి, టూరిస్టులకి భాష సమస్య కాదు. దేశాన్ని నాలుగు జిల్లాలుగా విభజించారు. 1906లో బ్రిటిష్ ప్రొటెక్టోరేట్‌గా ఉన్న ఈ బ్రూనై దారుస్సలాం 1984 జనవరిలో పూర్తి స్వాతంత్య్రం సంపాదించుకుంది. గల్ఫ్ దేశాల వలె పూర్తి స్థాయి రాజరికం ఉన్న అతి తక్కువ దేశాల్లో ఇదొకటి. ఈ దేశానికి ఆర్థిక వనరులు చమురు, సహజ వాయువే.

బ్రూనై అనగానే అందరికీ బ్రూనై సుల్తానే గుర్తుకు వస్తాడు. నిజమే ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో ఒకడైన హసనల్ బోల్కియా ఈ దేశపు రాజే. 1967 నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న 29వ రాజు. దాదాపు అరవై బిలియన్ డాలర్ల ఆస్తితో 1990 దశకంలో ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ దేశపు చమురు, సహజవాయువు నిక్షేపాల విలువ సుమారు 22 బిలియన్ డాలర్లు. సాధారణంగా నీళ్ళో, చమురో మాత్రమే ఉండే దేశాలు మనకు తెలుసు. కానీ ఈ బ్రూనై దారుస్సలాం ప్రత్యేకతల్లో ఒకటి అవి రెండూ పుష్కలంగా లభ్యం కావటం.

ఇస్లాం-రామరాజ్యం

క్రీస్తు శకం 6-7 శతాబ్దాల వరకు మహారాజు శ్రీవిజయన్ ఈ దేశాన్ని పరిపాలించాడు. దేశంలో అందరూ సంస్కృతం మాత్రమే మాట్లాడాలని శాసనం చేసి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత 15వ శతాబ్దంలో ఇస్లాం ప్రాబల్యం పెరిగి అదే అధికారిక మతంగా మారింది. అయితే భాషాపరంగా మాత్రం సంస్కృతమే ఇక్కడ అధికారిక భాషగా కొనసాగుతోంది. చరిత్ర ఆవిష్కరించే చిత్రాల్లో ఇదొకటి.

ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం సదుపాయాలతో పాటు అందరికీ ఇల్లు, కారు సమకూర్చుకోవడానికి తక్కువ వడ్డీతో బ్యాంకు ఋణాలు ఇస్తారు. ఇవన్నీ సాధ్యం కావడానికి ప్రధాన కారణం వారి తక్కువ జనాభానే. ఇక్కడ ప్రతీ వ్యక్తికి ఓ కారు తప్పనిసరి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా తక్కువ. అక్కడక్కడ విదేశీ శ్రామికుల కోసం మినీ బస్సులు కనబడతాయి. టాక్సీలు, ఆటోల్లాంటివి లేకపోవడం ఒక్కోసారి ఇబ్బందికరమేగాని ఏం చేస్తాం? టీవీ ఛానళ్ళు రోజుకి కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తాయి. అందులో నేరాలు-ఘోరాలు లాంటి కార్యక్రమాలు అసలు ఉండవు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఒక హత్య కూడా జరగలేదు. దానికి కారణం హత్యలు, ఆత్మహత్యలు, రేప్‌ల్లాంటి వార్తలు మచ్చుకైనా వినపడవు. కనపడవు. చిన్న చిన్న దొంగతనాలు, అవీ విదేశీ కార్మికులు చేసిన వాటి గురించే వింటూంటాం. ఇక్కడ మనుషులు అతి నెమ్మదిగా మాట్లాడతారు. భావావేశాలకు, ఉద్రేకాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించే వీళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్పిస్తూంటూంది.

రామరాజ్యం గురించి నేనెక్కడా చదవలేదు, వినడమే తప్ప. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. రాత్రి... అర్ధరాత్రి ఏ సమయంలోనైనా ఏ స్త్రీ అయినా రోడ్డుమీద ఒంటరిగా ఒక్కర్తే నడవగలిగే దేశం, ప్రదేశం ఇంకెక్కడైనా ఉందో లేదో తెలియదు కాని, ఇక్కడ మాత్రం ఉంది. అందుకే ఇది ఇస్లాంలో రామరాజ్యం అనుకుంటాను.

రాజు... రాజరికం... విలాసత్వం

బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా గురించి, ఆయన విలాసవంతమైన జీవన విధానం గురించి ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు- ప్రతీ సెకనుకి ముగ్గురు పిల్లలు పుడుతుంటారు ఈ భూమ్మీద!
అలాగే ప్రతి సెకనుకీ ఓ పది సెల్‌ఫోన్లు అమ్ముతుంటారు ప్రపంచవ్యాప్తంగా!
ప్రతి సెకనుకి ఈ ప్రపంచం 37 మిలియన్ల డాలర్లని ఖర్చుపెడుతుంటుంది కేవలం రక్షణ కోసం.
కానీ మన ఈ హసనల్ బోల్కియా ఆదాయం ప్రతీ సెకనుకి 90 యూరోల రూపంలో పెరుగుతూ ఉంటుంది...
అంటే వారానికి ఆయన ఆదాయం 54 మిలియన్ల యూరోలన్నమాట. ఇంకా చెప్పమంటారా నెలకి... సంవత్సరానికి.. వద్దులెండి... 'నో ఎన్వీ ప్లీజ్' అని ఆయన అధికారిక వెబ్‌సైట్ రాసింది... కాబట్టి ఆ విషయాన్ని వదిలేద్దాం. అయితే ఆయన నివాస గృహం గురించి రాయకుండా ఈ వ్యాసం ముగిస్తే నాకే అసంతృప్తిగా ఉంటుంది.

అతిపెద్ద రాజప్రాసాదం

'ఇస్తానా నూరుల్ ఇమాన్' ఆయన నివాసం పేరు. ఇస్తానా అంటే ఇక్కడి భాషలో రాజభవనం అని అర్థం. ఇలాంటివి ఇక్కడే ఓ నాలుగున్నా ఈ పేరుగల భవనం ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా పేర్కొనబడింది. బ్రూనై నది ఒడ్డున పూర్తి ఇస్లామిక్ సంస్కృతిలో నిర్మితమైన ఈ రాజభవనంలో 1788 గదులు (అంటే రోమ్‌లోని వాటికన్ కంటే 388 ఎక్కువ గదులు), 650 సూట్లు, ప్రతీ అంతస్థుకీ ఎస్కలేటర్స్. ఒకేసారి 500 మంది కూర్చోవడానికి వీలుగా డైనింగ్ హాల్, సుమారు 1500 మంది ఒకేసారి ప్రార్థన చెయ్యడానికి అనువైన ఓ మసీదు రాజభవనం లోపలే నిర్మించడం కొన్ని ప్రత్యేకతలు. ఇక హిజ్ మెజెస్టీ కోసమని ఓ హెలిపాడ్, 300 కార్లు పట్టే పార్కింగ్ ప్లేస్, క్లినిక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వగైరాలెన్నో ఉన్నాయి. దీని నిర్మాణానికి కావలసిన సామాగ్రిని 30 దేశాల నుంచి తెప్పించారు. ఈ రాజప్రాసాదం చూడ్డానికి ప్రతీ సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా మూడు రోజులు ప్రజలందరినీ (విదేశీయుల్ని కూడా) అనుమతిస్తారు. ఆ రోజు మగవాళ్ళందరూ రాజుగారితో, ఆడవాళ్ళందరూ రాణీగారితో కరచాలనం చేసే సంప్రదాయం ఉంది ఇక్కడ.

రాజు తలచుకుంటే...

మహారాజు హసనల్ బోల్కియా తనకంటూ ఓ ప్రత్యేకమైన విమానాన్నే ఏర్పరచుకున్నారని రాసేసి వదిలేస్తే పెద్ద విశేషమేముంది? వంద మిలియన్ డాలర్లు ఖరీదు చేసే విమానాన్ని కొని మరో వంద మిలియన్ల డాలర్ల ఖర్చుతో దాన్ని మరింత అందంగా బంగారంతో తాపడం చేయించుకున్న ఘనత ఈ రాజుగారిది. ఈ విమానంతో పాటు ఆరు చిన్న విమానాలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఈయన మన రాజీవ్ గాంధీ లాగా ఖుద్దు (పైలట్), వీలయినప్పుడల్లా తన విమానాన్ని తనే నడుపుకుంటూ వెడతాడు.
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg
65 ఏళ్ళ బోల్కియా ఈ మధ్య మన దేశాన్ని సందర్శించినప్పుడు కూడా తన విమానాన్ని తానే నడుపుకుంటూ వచ్చి మన వాళ్ళని ఆశ్చర్యపరిచాడు. తన ఐశ్వర్యానికి తగ్గట్టుగానే తన జీవన విధానాన్ని సాగించే ఈయన, తన కూతురి 18వ పుట్టినరోజుకి ఏకంగా ఓ ఎయిర్‌బస్‌నే కానుకగా ఇచ్చాడు. తన 50వ పుట్టిన రోజు సంబరాల్లో భాగంగా మైఖెల్ జాక్సన్‌ని ఈ దేశానికి పిలిపించి కార్యక్రమాన్ని చేయించడం బోల్కియా రాజరిక వైభోగానికి మరో ఉదాహరణ.
కొసమెరుపు : పేరులో దారు ఉన్నా ఇది పూర్తిగా డ్రై కంట్రీ. టూరిజం అంతగా అభివృద్ధి చెందకపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటని కొంతమంది వాపోతుంటారు.

ఇక్కడా మన రాముడే!
ప్రస్తుతం కాంబోడియా అని పిలువబడుతున్న కాంభోజ రాజ్యం వరకూ మన భారత రామాయణాలు పరిఢవిల్లేవనే విషయం కాస్తో కూస్తో బయట తిరిగే టూరిస్టులకి తెలియంది కాదనుకుంటాను. దీనికి బ్రూనై దారుస్సలాం అతీతం కాదు. ఇక్కడ కూడా రామాయణం పూర్తి స్థాయిలో రాణించడమే కాక రామాయణంలోని ముఖ్యపాత్రల పేర్లన్నీ ప్రతి ఇంట్లోను విన్పిస్తుంటాయి. పురుషులకు రమ్‌లీ అని, భుజాంగ్ అని, స్త్రీలకి సితి అని పేర్లు పెట్టుకుంటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం లక్ష్మణుడి పేరు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా ఓ ప్రత్యేకవర్గంగా ఉండడం. రాజుగారి ఆంతరంగిక రక్షకభటులుగా ఇప్పటికీ ఈ 'లక్ష్మణ' వర్గం పనిచేస్తుంటూంది. మలయ్ భాషలో దాదాపు నలభై శాతం సంస్కృత పదాలే వినపడడం కొంతలో కొంత మనదేశపు వాతావరణాన్ని గుర్తుకు తెస్తుంది.

గట్టిగా మాట్లాడితే..

ప్రశాంతతకి ఇచ్చే విలువ గురించి ఓ సంఘటన మీకు చెప్పి తీరాల్సిందే... ఓ పబ్లిక్ ప్రదేశంలో ఇద్దరు తమిళులు కూర్చుని 'మామూలు'గా మాట్లాడుకుంటున్నారట... ఓ పదిహేను నిమిషాలకి ఓ పోలీస్ వ్యాన్ వాళ్ళు కూర్చున్న దగ్గరకొచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు ఆఫీసర్లు దిగి "ఏంటి సమస్య? మీరిద్దరూ దెబ్బలాడుకుంటున్నారట కదా? పదండి స్టేషన్‌కి'' అన్నారట నెమ్మదిగానే... దానికి వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని "అయ్యో! అలాంటిదేమీలేదే... మేం మామూలుగా మాట్లాడుకుంటున్నాం'' అన్నారట... దానికి అక్కడే ఉన్న ఓ చిన్న దుకాణదారుడు బయటకొచ్చి "నేనే పోలీసుల్ని పిల్చా... ఏంటి మీరు కొట్టుకోట్లేదా... కొంచెంసేపాగితే ఒకర్నొకరు చంపేసుకుంటారేమోనని భయమేసి...'' అన్నాడట. అలా ఉంటాయి ఇక్కడ సంస్కారానికి సంబంధించిన విషయాలు.

నీటి నివాసం

వాటర్ విలేజ్ అని పిలవబడే ఎనిమిది కిలోమీటర్ల గ్రామం ఒకటి ఉంది ఇక్కడ. అక్కడ ఇళ్ళన్నీ నీటిపైనే. పూర్తి చెక్కతో చెయ్యబడ్డ ఈ ఇళ్ళు మామూలు వాటికి దేనిలోనూ తీసిపోవు. కొన్ని శతాబ్దాలుగా అక్కడే నీటిపైన నివాసం ఉంటున్నారు 30 వేల ప్రజలు. వాళ్లు వేరే గృహాల్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ప్రభుత్వమే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. టూరిస్టులు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఈ వాటర్ విలేజ్. దీన్ని మలయ్ భాషలో 'కంపోంగ్ ఐర్' అంటారు. కంపోంగ్ అంటే గ్రామం అని ఐర్ అంటే నీరు అని అర్థం.

- vasudevadari@gmail.com